Saturday, June 30, 2012


నాగార్జున అగ్రికెమ్‌ కర్మాగారంలో అగ్ని ప్రమాదం 

  • శ్రీకాకుళంలో భారీ పేలుడు
  • చిలుకపాలెం నాగార్జున అగ్రికెమ్‌లో ప్రమాదం
  • పేలిన రియాక్టర్‌, ఇంకా అదుపులోకి మంటలు
  • రంగంలోకి దిగిన పది ఫైరింజన్లు
  • ఎవరూ చనిపోలేదని ప్రకటించిన కలెక్టర్‌
  • గాయపడ్డ 17 మందికి రిమ్స్‌లో చికిత్స
  • లోపల 15 మంది చిక్కుకున్నట్లు అనుమానం
  • పేలడానికి సిద్ధంగా ఉన్న మరికొన్ని రియాక్టర్లు
  • చుట్టుముట్టిన దట్టమైన పొగ
  • సమీప గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తనున్న అధికారులు
  • గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశం
  • పేలుడు ఘటనపై నివేదిక కోరిన సీఎం
  • సహాయక  చర్యలు పర్యవేక్షిస్తున్న అధికారులు
  • పోలీసు బలగాలతో ఘటనా స్థలానికి చేరుకున్న ఇద్దరు డిస్సీలు
ఎప్పట్లా పొద్దున్నే డ్యూటీకి వెళ్లిన కార్మికులు.. అగ్ని కీలలకు బలి కావాల్సి వస్తుందని ఊహించలేదు. చుట్టుపక్కల గ్రామాలవారూ బాధితులయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల మండలాన్ని విషవాయువులు కమ్మేశాయి. నాగార్జున అగ్రికెమ్‌ కర్మాగారంలో సంభవించిన అగ్ని ప్రమాదం అంతకంతకూ విస్తరించింది. అగ్నిమాపక సిబ్బంది మూడు గంటల అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చాయ్‌. జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా చిలుకపాలెంలోని ఫార్మా ప్లాంట్‌లో చిన్న నిప్పు రవ్వ పెద్ద ప్రమాదానికి దారితీసింది. ఓ బ్లాక్‌లోని రియాక్టర్‌లో పేలుడు సంభవించింది. అగ్ని ప్రమాదం చూస్తుండగానే బడబాగ్నిగా మారింది. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చూస్తుండగానే మరో రెండు బ్లాక్‌లకు అగ్నికీలలు విస్తరించాయి. అంతే.. మంటలకు తోడు.. విషవాయువులు భారీగా వెలువడ్డాయి. కిలోమీటర్ల మేర విస్తరించాయి. దీంతో స్థానికంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. 

ప్లాంట్‌లో పనిచేస్తున్న కార్మికులు బయటకు పరుగు తీసినా లాభం లేకపోయింది. పేలుడు ధాటికి సుమారు 40 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని శ్రీకాకుళంలోని రిమ్స్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్లాంట్‌లో మరికొందరు కార్మికులు గల్లంతైనట్టు అనుమానిస్తున్నారు. మందుల కంపెనీలో తలెత్తిన అగ్ని ప్రమాదంపై సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు తనకు నివేదిక ఇవ్వాలన్నారు. అగ్రికెమ్‌ కర్మాగారం నుంచి వెలువడిన మంటలు, విషవాయువులు గాలినీ, ధూళిని కలుషితం చేసేశాయి. వాటి ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాలపై తీవ్రంగా పడనుంది. దీంతో.. సుమారు 10 గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. దీంతో.. ఎచ్చెర్ల మండలంలో భయాందోళనలు నెలకొన్నాయి.

No comments:

Post a Comment