Saturday, June 30, 2012

విజయనగరం


విజయనగరంలో సాగునీటి యుద్ధం

  • రెండు గ్రామాల సాగునీటి వివాదం
  • గంగచోలిపెంట-పురిడిపెంట రైతుల మధ్య ఘర్షణ
  • రాళ్లు రువ్వుకున్న రైతులు, నలుగురు రైతులకు గాయాలు
పంట కాల్వల వివాదం రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారి తీసింది. విజయనగరం జిల్లా గంగచోలిపెంట, పురిడిపెంట గ్రామాల మధ్య సాగునీటి కోసం వివాదం తలెత్తింది. ఆండ్రా రిజర్వాయర్‌ పంట కాల్వల సరిహద్దులను ఇరిగేషన్‌ శాఖ ఇది వరకు నిర్ణయించింది. అయితే ఈ సరిహద్దుల్లో లోపాలు ఉన్నాయంటూ రెండు గ్రామాల  రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు రైతులు రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో నలుగురు రైతులు గాయపడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.






విజయనగరం జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్‌లు వెలవెల

  • జీరోస్థాయికి పడిపోయిన నీటి నిల్వలు
  • ఆందోళన చెందుతున్న అన్నదాతలు
  • వరుణుడి కరుణ కోసం ఎదురు చూపులు
సాగునీటి ప్రాజెక్ట్‌ల్లో చుక్కనీరు లేకపోవడంతో విజయనగరం జిల్లా రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌ సాగు కష్టంగా మారిందని వాపోతున్నారు. ప్రాజెక్ట్‌ల్లో పుష్కలంగా నీరు చేరితే తప్ప వ్యవసాయం చేయలేమని అంటున్నారు.విజయనగరం జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్‌లు వెలవెలపోతున్నాయి. అయిదు ప్రధాన ప్రాజెక్ట్‌ల్లో సాగునీరు జీరో స్థాయికి పడిపోయింది. నీటి నిల్వలు లేక ప్రాజెక్ట్‌లు మైదానాలుగా మారాయి. ఈ పరిణామంతో సుమారు లక్షా ఎభై వేల ఎకరాల పంట ప్రశ్నార్థకంగా మారిందని  రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఖరీఫ్‌ సాగు అగమ్యగోచరంగా మారిందని వాపోతున్నారు. జిల్లాలో పెద్ద ప్రాజెక్ట్‌ తోటపల్లితో సహా జంఝావతి, తాటిపూడి, ఆండ్ర ప్రాజెక్ట్‌ల పరిస్థితి అయోమయంగా తయారయ్యాయి. భారీ వర్షాలు నమోదైతే తప్ప ఈ పరిస్థితిలో మార్పు వచ్చేలా కనబడటం లేదు. వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తూ, రైతన్నలు దుక్కు దున్నుతున్నారు.సాగునీటి ప్రాజెక్ట్‌లు జలకళతో కళకళలాడాలని రైతన్నలు గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు.

No comments:

Post a Comment